: కాల్పులు యూపీ గ్యాంప్ పనే... నల్గొండ జిల్లా ఎస్పీ ప్రకటన, సూర్యాపేటలో పోలీసు బాసులు


పోలీసులపై కాల్పులు యూపీ గ్యాంగ్ పనేనని నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకరరావు ప్రకటించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైన సంగతి తెలిసిందే. సమాచారం తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే సూర్యాపేట చేరుకున్న ఎస్పీ ప్రభాకరరావు, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సూర్యాపేట సమీపంలోని ఓ హోటల్ వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీసులతో వివరాలు సేకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాల్పులకు పాల్పడిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ సభ్యులేనని చెప్పారు. యూపీ ముఠా జిల్లాలో ప్రవేశించిందన్న సమాచారంతోనే సోదాలు చేస్తున్నామని చెప్పిన ఆయన, సూర్యాపేట పోలీసులకు తారసపడ్డ సదరు గ్యాంగ్ కాల్పులకు తెగబడిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, జిల్లావ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లాలోని అన్ని సరిహద్దులపై కన్నేసిన పోలీసులు స్పెషల్ పార్టీలను రంగంలోకి దించారు. మరోవైపు కాల్పుల సమాచారం అందుకున్న హైదరాబాద్ రేంజీ ఐజీ నవీన్ చంద్, డీఐజీ గంగాధర్ కూడా సూర్యాపేట చేరుకున్నారు.

  • Loading...

More Telugu News