: ఎందుకెళ్లాడు నీ చిన్నాన్న అక్కడికి... ఏం హక్కుంది?: 'పులివెందుల' ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని వైసీీపీ అంటోందని, దానిపై మీ అభిప్రాయం చెప్పండని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. కనీస అవగాహన ఉన్న పార్టీయేనా అది? అంటూ ప్రశ్నించారు. అవగాహన ఉంటే అలా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ వద్ద వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళనపై వ్యాఖ్యానిస్తూ "వాళ్ల (జగన్) చిన్నాన్న అక్కడికెళ్లి గొడవ చేస్తాడు. అయినా, నీళ్లుంటే కదా ఇవ్వడానికి. ఎందుకెళ్లాడు నీ చిన్నాన్న అక్కడికి? అసలాయనకు ఏం హక్కుంది? ఆ నీళ్ల కోసమే ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. నెల్లూరు జిల్లాలో 20 టీఎంసీల నీరిచ్చి 8 లక్షల 50 వేల ఎకరాలను ఆదుకున్నాం. పులివెందులలో చీనీ తోటలు ఎండిపోతుంటే ఆదుకున్నాం. మరలా నీరిచ్చే ప్రయత్నంలో కొందరు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు యత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 16 టీఎంసీల నీరిస్తే 20 వేల బోరు బావుల్లో జలమట్టం పెరిగింది. అక్కడి చెరువుల్లో నీళ్లు చూసుకుని ప్రజలు తమ జీవితాల్లో పండుగ వాతావరణం నెలకొందన్న రీతిలో ఆనందపడిపోయారు" అని తెలిపారు. వైసీపీ నేతలు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో తనకు తెలియదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిదని హితవు పలికారు.