: ఆ ఇద్దరు కీచకులకు బతికున్నంత కాలం జైలు శిక్ష
సుమారు 20 మందిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు ఆటోడ్రైవర్లకు బతికున్నంత కాలం జైలు శిక్ష విధిస్తూ కర్నూలు న్యాయస్థానం తీర్పుచెప్పింది. కర్నూలులో ఆటోడ్రైవర్లుగా జీవిస్తున్న రవి, శ్రీనివాస్ కొంతకాలం క్రితం కర్ణాటక నుంచి వచ్చిన ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో, దర్యాప్తు చేపట్టిన పోలీసులు విభ్రాంతికరమైన నిజాలు వెలికితీశారు. వీరిద్దరూ సుమారు 20 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిసింది. విద్యార్థినులు, మెడికోలు వీరి బారినపడి అత్యాచారానికి గురైనట్టు గుర్తించారు. వీరిద్దరూ దోపిడీలు, అత్యాచారాల్లో ఆరితేరినవారుగా తేల్చారు. దీంతో, కేసును విచారించిన కర్నూలు కోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి, బతికున్నంత కాలం వీరు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. కాగా, నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.