: సరూర్ నగర్ లో ప్రతీకార కాల్పులు... నేటి బాధితుడు నాటి నిందితుడే!
హైదరాబాదులోని సరూర్ నగర్ లో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు చికెన్ తీసుకువస్తున్న ఓ వ్యక్తిపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. అతని తొడ, పొట్టలోకి బుల్లెట్లు దిగడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గాయపడ్డ వ్యక్తిని సంజీవని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తులో పలు కీలక, ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కాల్పులకు గురైన వ్యక్తిని ఏలూరులోని పినకడిమి హత్య కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుగా గుర్తించారు. గత ఏడాది ఏప్రిల్ 6న ఏలూరులోని జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకేసులో నాగరాజు కూడా నిందితుడే. అప్పటి నుంచి నాగరాజు పరారీలో ఉన్నాడు. దీంతో నాగరాజు, మరో 9మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య జరిగిన వారం తరువాత నాగరాజు బృందం పోలీసులకు లొంగిపోయింది. పదిరోజుల కస్టడీ తరువాత నాగరాజు, అతడి ఇద్దరు కుమారులు పరారయ్యారు. గత సెప్టెంబర్ నెలాఖరులో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటుపల్లి వద్ద గంధం నాగేశ్వరరావు (55), అతని కుమారులు గంధం పెదమారయ్య (36), గంధం చినమారయ్య (32) హత్యకు గురైన సంగతి తెలిసిందే. వీరూ కూడా భూతం దుర్గారావు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారే. గంధం కుటుంబ సభ్యుల హత్యలు దుర్గారావు సోదరులు గోవింద్, శ్రీనివాసరావు చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి వారిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా నాగరాజుపై హత్యయత్నం జరగడంతో వారి ప్రమేయంపై మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, బాధితుడు నాగరాజు, హైదరాబాదులోని సరూర్ నగర్ లో సత్యనారాయణ పేరిట ఆరునెలల క్రితం అద్దెకు ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అతని ఆనుపానులు గుర్తించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.