: రోగి బంధువులు వైద్యుడి కాళ్లు, చేతులు విరిచేశారు... సరైన చికిత్స చేయలేదట!
రోగుల బంధువుల తీరు కొన్నిసార్లు అదుపు తప్పుతోంది. వైద్యులపై తిరగబడుతూ, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, మెదక్ లో దారుణం చోటుచేసుకుంది. వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే, సరైన చికిత్స చేయలేదని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆయనపై దాడికి దిగారు. ఈ దాడిలో డాక్టర్ కాళ్లు, చేతులు విరిగి, పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం అతనిని హైదరాబాదు తరలించారు. డాక్టర్ ఆశీర్వాదంపై దాడికి దిగినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.