: ఐసీసీ అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ముస్తఫా ఐసీసీ నిర్ణయాలపై బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే తన దేశ జట్టు ఓటమిపాలైందని కమల్ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. సదరు అంపైర్లపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అటుపై, నియమావళి ప్రకారం విజేతకు తానే ట్రోఫీ బహుకరించాల్సి ఉన్నా, ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ నిబంధనలు ఉల్లంఘించి ఆసీస్ కు కప్ ప్రదానం చేశారని కినుక వహించారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు.