: బెంగళూరు కాలేజీలో కాల్పుల కలకలం... విద్యార్థిని దుర్మరణం, మరొకరికి గాయాలు
బెంగళూరులోని ప్రగతి రెసిడెన్షియల్ కాలేజీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు చోటుచేసుకున్నాయి. కాలేజీలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న మహేశ్ తుపాకీ చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ఇంటర్ విద్యార్థిని గౌతమి(18) దుర్మరణం పాలు కాగా, ఆమె స్నేహితురాలు శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల సమాచారంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన వెంటనే మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తన ప్రేమను తిరస్కరించిన కారణంగానే మహేశ్, గౌతిమిపై కాల్పులు జరిపాడని తెలుస్తోంది. కాల్పుల ఘటనతో కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.