: బ్రిటన్ లో సిక్కు యువకుడిపై జాత్యహంకార దాడి!
బ్రిటన్ లో ఓ సిక్కు యువకుడిపై దాడి కలకలం రేపింది. చాలా కాలం తరువాత శ్వేతజాతీయేతరులపై దాడి చోటుచేసుకోవడంతో బ్రిటన్ లో ఉన్న విదేశీయుల్లో ఆందోళన చోటుచేసుకుంది. బర్మింగ్ హోమ్ లోని బోర్డ్ స్ట్రీట్ లో ఒంటరిగా తనదారిన తాను వెళ్తున్న సిక్కు యువకుణ్ని కొందరు దుండగులు అటకాయించి, దాడికి దిగారు. సిక్కు యువకుడిపై దాడికి దిగిన ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దుండగుల దాడిలో సిక్కు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిక్షిప్తమైన సీసీ ఫుటేజ్ ను 'డైలీ సిఖ్ అప్డేట్స్' ఫేస్ బుక్ పేజీలో ఉంచారు. ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా బ్రిటన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కాగా, బాధితుడి వివరాలు తెలియలేదని, ఆయన ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే, అతనికి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని బర్మింగ్ హోమ్ పోలీసులు భరోసా ఇచ్చారు. దీనిని జాత్యహంకార దాడిగా భావిస్తున్నామని వారు తెలిపారు.