: ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చేందుకు యువీ, జహీర్ తహతహ


టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్లు యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ పునరాగమనం చేసేందుకు తహతహలాడుతున్నారు. గాయాల కారణంగా జహీర్ జట్టుకు దూరం కాగా, జట్టు వ్యూహాలకు సరిపోడంటూ యువీని పక్కనబెట్టారు. వరల్డ్ కప్ తుది జట్టుకు యువీని ఎంపిక చేయకపోవడంపై కెప్టెన్ ధోనీ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ నేపథ్యంలో, యువీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది కూడా. జడేజా స్థానంలో ఈ పంజాబ్ ఆల్ రౌండర్ ఉండి ఉంటే ఫలితం మరోలా వచ్చేదని క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు. అదలావుంటే... మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ పోటీలకు తెరలేవనుంది. ఈ పోటీల్లో సత్తా చాటి భారత జట్టులో స్థానం దక్కించుకోవాలని యువీ, జహీర్ పట్టుదలగా ఉన్నారు. దీనిపై యువీ మాట్లాడుతూ, "అనారోగ్యం నుంచి కోలుకుని మంచి షేప్ లో ఉన్నాను. ఈ రెండేళ్లు నాకు కష్టకాలం. దేశవాళీల్లో రాణించి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని పేర్కొన్నాడు. ఇక, జహీర్ మాట్లాడుతూ, కొంతకాలంగా క్రికెట్ కు దూరమయ్యానని తెలిపాడు. మళ్లీ క్రికెట్ లోకి వచ్చేందుకు తొలి అడుగు ఐపీఎల్ ద్వారా వేస్తున్నానని తెలిపాడు. జహీర్, యువీ తాజా ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News