: కేరళలో ప్రభుత్వ మద్యం విధానానికి వత్తాసు పలికిన హైకోర్టు
కేరళ ప్రభుత్వం రూపొందించిన కొత్త మద్యం విధానానికి ఆ రాష్ట్ర హైకోర్టు వత్తాసు పలికింది. హైకోర్టు తాజా నిర్ణయానికి ముందు చాలా కథే నడిచింది. కేరళలో మద్యం విధానంపై బార్ యజమానుల సంఘం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో 730 బార్లు నాసిరకం ప్రమాణాలతో ఉన్నాయని ముద్రవేస్తూ, ఫైవ్ స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా వదిలివేయడంలోని లాజిక్ ఏంటని అడిగింది. నాసిరకం ప్రమాణాలు అంటే ఏంటి? అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిలో ఏం లాజిక్ ఉందో తనకు అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును పరిష్కరించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో, దీనిపై కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, వాదప్రతివాదనలు విన్న కేరళ హైకోర్టు ప్రభుత్వ విధానానికి మద్దతుగానే తీర్పు వెలువరిచింది. దీంతో, కేరళలో ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ, నిర్దేశించిన బార్లలోను మాత్రమే మద్యం లభించనుంది.