: సెక్షన్ 304ఎను సమీక్షించాలని సుప్రీం సూచన
ఐపీసీ సెక్షన్ 304ఎ ప్రకారం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి, వ్యక్తుల మరణానికి దారితీసిన కేసుల్లో రెండు సంవత్సరాల జైలు శిక్ష కానీ, లేక, జరిమానా కానీ ... కొన్ని సమయాల్లో రెండూ కానీ విధిస్తారు. తాజాగా దానిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల కేసుల్లో అతి తక్కువ శిక్ష విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దాని మూలంగా న్యాయవ్యవస్థ అపహాస్యం పాలవుతోందని పేర్కొంది. 2007లో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసిన ఓ ప్రమాద కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వెంటనే సెక్షన్ 304ఎ చట్టాన్ని పునఃసమీక్షించాలని చట్టసభ్యులకు సూచించింది. వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని గమనించామని, చాలా బాధగా ఉండటంవల్లే ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని న్యాయస్థానం తెలిపింది. నాగరీకులుగా చెప్పుకునే కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం, అత్యుత్సాహ చర్యల వల్ల ఇతరులు బలవుతున్నారని పేర్కొంది. పేదల ప్రాణాలు విలువైనవిగా భావించాలని జస్టీస్ దీపక్ మిశ్రా, ప్రపుల్ సి.సంపత్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికైనా ఆ చట్టాన్ని సమీక్షించాలని చెప్పింది.