: చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు: వీహెచ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు దానిపై కేంద్రాన్ని అడగడం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు, వెంకయ్య ఎందుకు పోరాడరని ఆయన నిలదీశారు. పునర్విభజన చట్టం ప్రకారం 2014 ఆర్థిక సంవత్సరంలో 14,000 కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉండగా, పది వేల కోట్ల రూపాయలు సాధిస్తామని చంద్రబాబు, వెంకయ్య చెప్పారని ఆయన వెల్లడించారు. ఆ నిధులు ఎందుకు తేలేకపోయారని వీహెచ్ అడిగారు. నిధులు ఎందుకు తేలేకపోయారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ నేతలు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ సహా అన్ని పార్టీలు ఒప్పుకుని, లేఖలు ఇచ్చిన తరువాతే రాష్ట్ర విభజన చేశారని, విభజన పాపాన్ని సోనియా గాంధీపై మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.