: బీజేపీ రికార్డు స్థాయి సభ్యత్వ నమోదుపై గోవా కాంగ్రెస్ విమర్శలు


దేశ వ్యాప్తంగా 8.8 కోట్ల సభ్యత్వ నమోదుతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీపై గోవా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ఎప్పుడూ నెంబర్ గేమ్ ఆడుతుందని, వాటితోనే మోసం చేస్తుందని ఆరోపించింది. ఈ మేరకు గోవా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గాదాస్ కామత్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ చెబుతున్న సభ్యత్వ సంఖ్యకు, అది పొందే ఓట్లకు సంబంధం లేకుండా ఉందన్నారు. ఇటీవల గోవాలో ఓ జిల్లా పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీలో మొత్తం నాలుగు లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని బీజేపీ చెప్పిందని, కానీ మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి లక్షా 50వేల 674 ఓట్లు మాత్రమే వచ్చాయని ప్రకటనలో తెలిపారు. వారు చెప్పిన ప్రకారం మిగతా వాళ్లంతా సొంత పార్టీకి ఓటు వేయకుండా వెనక్కెళ్లారా? లేక సభ్యత్వం రద్దు చేసుకున్నారా? అని దుర్గాదాస్ ప్రశ్నించారు. చిన్న రాష్టమైన గోవా సభ్యత్వం విషయంలోనే బీజేపీ ఇంత మోసం చేస్తే... ఇక దేశ వ్యాప్తంగా సభ్యత్వ సంఖ్యపై ఎంత మోసం చేసిందోనని ఎద్దేవా చేశారు. ఈ విమర్శలపై గోవా బీజేపీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ స్పందించారు. తమకు ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ పార్టీ సభ్యులు మాత్రం అలాగే ఉన్నారన్నారు.

  • Loading...

More Telugu News