: టీఆర్ఎస్ నేతలకు ‘గులాబీ’ ట్రాక్టర్లు... ‘సబ్సీడీ’ ఫలాలన్నీ అధికార పార్టీ వారికేనట!
కొత్త రాష్ట్రం తెలంగాణలోనూ ఇతర రాష్ట్రాల్లో మాదిరే పాలన సాగుతోంది. అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపేలా పథకాలు అమలవుతున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ కింద విడుదల చేసిన సబ్సీడీ ట్రాక్టర్ల పంపిణీనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఆరు మండలాల్లో 16 ట్రాక్టర్లను ప్రభుత్వం సబ్సీడీ కింద రైతులకు పంపిణీ చేసింది. ఈ ట్రాక్టర్లు పొందిన 16 మంది రైతులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలేనట. అంతేకాక, ఇతర పార్టీల్లో ఉంటూ, ఇటీవలే గులాబీ తీర్థం పుచ్చుకున్న నేతలకు కూడా ఈ ట్రాక్టర్లు అందాయి. పరకాలలో మొన్నటిదాకా టీడీపీ నేతగా కొనసాగిన నాగిరెడ్డి ఇటీవల గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. దీంతో ఆయనకు ఈ 16 ట్రాక్టర్లలో ఒకటి చేరిపోయింది. రూ.10 లక్షల విలువ చేసే సదరు ట్రాక్టర్లను ప్రభుత్వం సబ్సీడీ కింద కేవలం రూ.5 లక్షలకే అందిస్తోంది. దీంతో ఈ ‘గులాబీ’ ట్రాక్టర్లను చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ చోటామోటా నేతలు రంగంలోకి దిగారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.