: ఇక అన్నీ బయటపెడతా: ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్
ఐసీసీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. గత కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు వరల్డ్ కప్ సందర్భంగా బయటపడ్డాయి. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్, అధ్యక్షుడు ముస్తఫా కమల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా, వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరు విజేతకు అందించాలన్న విషయంలోనూ వీరిద్దరూ పోటీపడ్డారు. చివరికి శ్రీనివాసనే ఆసీస్ జట్టుకు ట్రోఫీ బహుకరించారు. దీన్ని కమల్ తీవ్రంగా నిరసించారు. 2015 జనవరిలో సవరించిన నిబంధనల ప్రకారం గ్లోబల్ ఈవెంట్లలో బహుమతిని ఐసీసీ అధ్యక్షుడే అందించాలని అన్నారు. బంగ్లాదేశ్ మీడియాతో మాట్లాడుతూ "ట్రోఫీని ఇవ్వాల్సింది నేను. ఐసీసీ రాజ్యాంగం నాకు అందించిన హక్కు అది. దురదృష్టవశాత్తు అందుకు నన్ను అనుమతించలేదు. నా హక్కులను కాలరాశారు. స్వదేశం (బంగ్లాదేశ్) వెళ్లిన తర్వాత, ఐసీసీలో ఏం జరుగుతోందన్న విషయం అందరికీ తెలియచెబుతా. వారి అవకతవకలపై ప్రపంచానికి తేటతెల్లం చేస్తా" అని పరోక్షంగా శ్రీనీ వర్గంపై ధ్వజమెత్తాడు. కమల్ అంతకుముందు, భారత్-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంపైర్లు పక్షపాతం ప్రదర్శించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. టీమిండియాకు లాభించేలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.