: విద్యుత్ ప్లాంట్ దక్కించుకోవాలని జగన్ ప్లాన్ వేశారు: ఉమ
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. పోలవరం గురించి మాట్లాడుతున్న జగన్, గతంలో ఎప్పుడైనా ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడిగారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. అసలు, పోలవరం నాలుగేళ్లు ఆలస్యం అయ్యేందుకు జగనే కారణమని మండిపడ్డారు. పోలవరం వద్ద విద్యుత్ ప్లాంట్ దక్కించుకోవాలని జగన్ ప్లాన్ వేశారని ఉమ ఆరోపించారు. జగన్ వ్యవహారమంతా కమీషన్ల కోసం కక్కుర్తి అని విమర్శించారు. తాము ఆశావహ దృక్పథంతో ముందుకెళుతున్నామని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటున్నామని, పోలవరం స్పిల్ వే శంకుస్థాపనపై చర్చించామని చెప్పారు. పోలవరం కట్టేలోగా పట్టిసీమతో రాయలసీమను కాపాడతామని భరోసా ఇచ్చారు. పట్టి సీమ గురించి ఏం తెలుసని జగన్ మాట్లాడుతున్నారని నిలదీశారు. జగన్ ఏమీ తెలియకుండా రాష్ట్రాల నీటివాటాపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈడీ ఆస్తుల జప్తుతో జగన్ కు జైలు భయం పట్టుకుందనీ, ఈడీ భయంతోనే జగన్ ప్రధాని కాళ్ల వద్దకు వెళ్లారని ఎద్దేవా చేశారు.