: గత వందేళ్లలో ఇలాంటి మార్చి నెల లేదట!
గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. హుదూద్ బారిన పడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వేసవితాపం పెరిగింది. భానుడి ప్రతాపానికి మధ్యాహ్న సమయాల్లో రోడ్లపైకి రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. అయితే, గత రెండు రోజులుగా వాతావరణంలో అకాల మార్పులు సంభవించాయి. వాతావరణం చల్లబడడంతో పాటు, వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు, ఉత్తర, మధ్య భారతదేశంలో గత వందేళ్లలో ఇంత చల్లటి మార్చి నెల లేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర, మధ్య భారతదేశాన్ని తాజా వర్షాలు చల్లబరిచాయని వారు పేర్కొంటున్నారు. 1915 తరువాత మార్చిలో చల్లగా ఉండడం ఇదేనని వారు స్పష్టం చేశారు. కాగా, తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల పరిధిలో 107 లక్షల ఎకరాల్లో రబీపంట నాశనమైందని వాతావరణ విభాగాలు వెల్లడించాయి. మరో రెండు వారాల పాటు ఇదే వాతావరణ స్థితి కొనసాగుతుందని నిపుణులు తెలిపారు.