: నేను ముస్లిం యువతిని వివాహం చేసుకోవడం నాన్నకు ఇష్టమే: యువన్ శంకర్ రాజా
తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గతేడాది ముస్లిం యువతి జఫరున్నీసాను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అతని తండ్రి, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇష్టం లేదని, అందుకే కొడుకు వివాహానికి హాజరు కాలేదని వార్తలొచ్చాయి. తాజాగా దానిపై యువన్ స్పందిస్తూ, తన వివాహం తండ్రికి ఇష్టమేనని తెలిపాడు. సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేకపోయారని వివరించాడు. పెళ్లి తరువాత ఇంటికెళ్లినప్పుడు తనకు తండ్రి స్వాగతం పలికారని చెప్పాడు. తాను ఇస్లాంలోకి మారినప్పటికీ యువన్ పేరునే ఇష్టపడతానన్నాడు. అది తన ఐడెంటిటీ అని, ఆ పేరును మార్చుకునే ఆలోచన లేదని యువన్ స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా తాను క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని, స్వయంకృతాపరాధంతో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నట్టు యువన్ వెల్లడించాడు. ప్రస్తుతం తన వృత్తి మీదే దృష్టి పెడుతున్నట్టు తెలిపాడు.