: ఎమ్మెల్సీల ప్రమాణంలో ఉద్రిక్తత... టీడీపీ, వైసీపీల మధ్య వాగ్వాదం
కొత్తగా శాసనమండలికి ఎంపికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్స్ స్థానం నుంచి టీడీపీ బలపరచిన అభ్యర్థి రామకృష్ణ, ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ స్థానంలో వైసీపీ మద్దతిచ్చిన యూటీఎఫ్ నేత రాము సూర్యారావులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మండలికి కొత్తగా ఎన్నికైన వీరు నేటి ఉదయం ప్రమాణస్వీకారం చేసేందుకు మండలి చైర్మన్ చక్రపాణి ఛాంబర్ కు చేరుకున్నారు. వీరితో పాటు టీడీపీ, వైసీపీలకు చెందిన పలువురు నేతలు వచ్చారు. ఎమ్మెల్సీల ప్రమాణం సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతేకాక ఇరుపార్టీ నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో చక్రపాణి ఛాంబర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.