: ఢిల్లీలో గ్యాంగ్ వార్... దుండగుల కాల్పుల్లో ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం గ్యాంగ్ వార్ జరిగింది. ఢిల్లీవాసులను భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఘటనలో అకాళీదళ్ నేత, మాజీ ఎమ్మెల్యే భరత్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన ఆయనపై దాడికి దిగిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో భరత్ సింగ్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ఘటనలో ఆయన ఇద్దరు గన్ మెన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు గుర్గావ్ లోని మేదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ ఢిల్లీలోని నఫజ్ గఢ్ ప్రాంతానికి చెందిన రఘునందన్ వాటికలో జరుగుతున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన భరత్ సింగ్ పై దుండగులు పక్కా పథకం ప్రకారం విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ తరహాలోనే ఆయనపై 2012లోనూ దాడి జరిగింది. నాటి దాడిలో బతికిపోయిన భరత్ సింగ్ నిన్నటి ఘటనలో మృతి చెందారు.