: జర్మన్ వింగ్స్ ఫ్లైట్ దుర్ఘటనకు ‘వైల్డ్ టేల్స్’ ప్రేరణ!
కో పైలట్ దుశ్చర్య కారణంగా కూలిపోయిన జర్మన్ వింగ్స్ విమానం దుర్ఘటన వెనుక మరో కొత్త కోణం వెలుగు చూసింది. హాలీవుడ్ చిత్రం 'వైల్డ్ టేల్స్' చూసి ప్రేరణ పొందిన కో పైలట్ ఆండ్రియాస్ లుబిడ్జ్ విమానాన్ని కూల్చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బార్సిలోనా నుంచి 142 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డస్సెల్ డార్ప్ కు బయలుదేరిన జర్మన్ వింగ్స్ విమానం ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ దుర్మరణం చెందారు. విమానం బ్లాక్ బాక్స్ ను పరిశీలించిన అధికారులు, విమానం కూలిపోవడానికి లుబిడ్జ్ కారణమని తేల్చిన సంగతి తెలిసిందే. అచ్చం వైల్డ్ టేల్స్ చిత్రంలో మాదిరే ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ లుబిడ్జ్ విమానాన్ని కూల్చేశాడు. వైల్డ్ టేల్స్ చిత్రంలోనూ కాక్ పిట్ నుంచి బయటకు వెళ్లిన పైలట్, తిరిగి అందులోకి ప్రవేశించలేడు. లోపల ఉన్న కో పైలట్ తలుపులు బిగించుకోవడంతో పైలట్ పెద్దగా అరవడం, దానిని చూసి ప్రయాణికులు హాహాకారాలు చేయడం గమనార్హం.