: బాణసంచా పేలుడులో ఏడుకు చేరిన మృతుల సంఖ్య... నేడు ఘటనాస్థలికి డిప్యూటీ సీఎం
విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులో చోటుచేసుకున్న బాణసంచా పేలుడులో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. నిన్న జరిగిన పేలుడులో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఏపీ సర్కారు సీరియస్ గా పరిగణించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. బాణసంచా తయారీదారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని భావిస్తున్న ప్రభుత్వం, ఇకపై తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఘటనాస్థలిని నేడు ఏపీ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సందర్శించనున్నారు.