: రెండు రాష్ట్రాలూ కావాలి... టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింతగా కష్టపడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలూ ముఖ్యమేనని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలే కీలకమని అన్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ కు భారతరత్న గౌరవాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నేత నారా లోకేశ్ తోపాటు మంత్రి అయ్యన్నపాత్రుడు, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ గౌడ్, పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.