: కమల్ కమిట్ మెంట్ అద్భుతం: రమేశ్ అరవింద్
'ఉత్తమ విలన్' ఆడియో వేడుక సందర్భంగా దర్శకుడు రమేశ్ అరవింద్ హీరో కమల్ హాసన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. కమల్ కమిట్ మెంట్ అద్భుతమని అన్నాడు. సినిమా అంగీకరించాక ఆయన దేనికైనా సిద్ధపడతాడని తెలిపాడు. పేజీల కొద్దీ డైలాగులిచ్చినా, కవితలు చెప్పమని కోరినా... ఇలా ఏదైనా ఆయన నిబద్ధతతో వ్యవహరిస్తాడని వివరించాడు. ఈ సినిమా ఫ్యామిలీ చిత్రమని, వినోద ప్రధానమైనదని, మ్యూజికల్ అని తెలిపారు. కమల్ నటన ప్రాభవం ఈ సినిమా ద్వారా సరికొత్త ఎత్తులకు చేరుతుందని అన్నారు. ఆయన ప్రతి సీన్ కు తనను తాను మెరుగు పర్చుకునేందుకు శ్రమిస్తారని కొనియాడారు. కొన్ని సీన్లు, కొన్ని డైలాగుల ద్వారా చెప్పే కథను ఓ పాట ద్వారా ఇందులో చెప్పే ప్రయత్నం చేశామని వివరించారు. దర్శకత్వం అవకాశం ఇచ్చిన కమల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో గ్లోబల్ టాలెంట్ కనిపిస్తుందని తెలిపారు. విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు తమ చిత్రానికి పనిచేశారని రమేశ్ అరవింద్ చెప్పారు. అనంతరం, కమల్ స్నేహితురాలు, నటి గౌతమి మాట్లాడుతూ... ఈ సినిమా కమల్ అభిమానులను తప్పక అలరిస్తుందని అన్నారు. 'ఉత్తమ విలన్'లో అన్ని అంశాలు మిళితమై ఉన్నాయని తెలిపారు.