: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు...గంట ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై సౌకర్యం అందజేసేందుకు సమాయత్తమైంది. ఏప్రిల్ 1 నుంచి 'ఇంట్రానెట్ వైఫై' సౌకర్యం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులోకి రానుంది. విజయవాడ నుంచి ప్రారంభం కానున్న ఈ సౌకర్యం, హైదరాబాదు, విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో అందుబాటులో ఉంచనుంది. దీనిని నెమ్మదిగా విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా నడిచే బస్సులకు విస్తరించాలని ఆర్టీసీ భావిస్తోంది. గంటపాటు వైఫై సౌకర్యాన్ని ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటును ఆర్టీసీ కల్పిస్తోంది. తరువాత 10 రూపాయలు చెల్లిస్తే గమ్యం చేరేవరకు ఎంతసేపైనా వైఫై వినియోగించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ వైఫై సౌకర్యాన్ని వినియోగంలోకి తెచ్చినట్టు తెలుస్తోంది. వైఫై కోసం బస్సులో ఓ కంప్యూటర్, వైఫై పరికరం అందుబాటులో ఉంటాయట. ఈ కంప్యూటర్ లో 50 సినిమాలు, 400 వీడియో పాటలు అందుబాటులో ఉంచుతారట. వీటిని వారివారి మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లలో వీక్షించుకోవచ్చని ఆర్టీసీ చెబుతోంది.