: దోపిడీకి గురైన కోన వెంకట్, దానయ్య...తప్పించుకున్న శ్రీను వైట్ల, తమన్
సినీ మాటల రచయిత కోన వెంకట్, నిర్మాత దానయ్య దారిదోపిడీకి గురవ్వగా, దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు తమన్ తప్పించుకున్న ఘటన షాద్ నగర్ లో చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జన్మదినం సందర్భంగా షాద్ నగర్ లోని ఆయన ఫాంహౌస్ కమ్మదనంలో పార్టీ జరిగింది. దానికి హాజరైన రచయిత కోన వెంకట్, నిర్మాత దానయ్య, ప్రవీణ్ అనే మరోవ్యక్తి, డ్రైవర్ సుబ్రమణ్యంతో కలిసి వెనుదిరిగారు. వెనుక కారులో శ్రీను వైట్ల, తమన్ వస్తున్నారు. ఇంతలో నూర్ కళాశాల సమీపంలోని కల్వర్టు దగ్గర రోడ్డుకు అడ్డంగా చెట్టుపడి ఉండడంతో ఆగిన కారుపై ఇద్దరు దుండగులు గొడ్డలితో దాడికి దిగారు. గొడ్డలితో కారు అద్దం పగులగొట్టి, డ్రైవర్ పై దాడికి దిగారు. అనంతరం వారిని బెదిరించి, కోన వెంకట్ మెడలో గొలుసు, దానయ్య మెడలోని రెండు గొలుసులు, రెండు ఉంగరాలు, డ్రైవర్ సుబ్రమణ్యం నుంచి 1500 రూపాయలు లాక్కుని పరారయ్యారు. దీనిని గమనించిన శ్రీను వైట్ల, తమన్ వెనక్కితిరిగి వెళ్లిపోయారు. కొద్దిదూరంలోని పోలీసులకు వారు సమాచారమివ్వడంతో వారు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రకాశ్ రాజ్ డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.