: ఒంటిమిట్టలో కేఈ కృష్ణమూర్తి, భద్రాచలంలో కేసీఆర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం అధికారిక వేడుకలు నిర్వహించనుండగా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనుంది. ఛైత్రశుధ్ద నవమి అభిజిత్ లగ్నమందు శ్రీరామకల్యాణం నిర్వహించనున్నారు. ఒంటిమిట్టలో వేడుకలకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరుకానుండగా, భద్రాచలంలో వేడుకల్లో టీఎస్ సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఉత్తరాంధ్రలోని రామతీర్థంలో కూడా ఏపీ ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహించనుంది. ఒంటిమిట్టలో శ్రీరాములోరికి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, రామతీర్థంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భద్రాచలంలో కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, ఏప్రిల్ 2న జరిగే కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గోనున్నారు. దేశంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామకల్యాణాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకుంటున్నారు.