: భూసేకరణ బిల్లుపై మరోసారి ఆర్డినెన్స్ జారీకి కేంద్రం సిద్ధం
భూసేకరణపై మరోసారి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. భూసేకరణ బిల్లుపై జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్ 5తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రాజ్యసభను ప్రోరోగ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భూసేకరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటంతో బిల్లు వీగిపోకుండా ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సీసీపీఏ సమావేశంలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో దశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరగనున్న నేపథ్యంలో, ఏదో ఒక సభను ప్రోరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కేంద్రానికి లేని నేపథ్యంలో రాజ్యసభను ప్రోరోగ్ చేసినట్టు తెలిపారు.