: అసెంబ్లీ సాక్షిగా పిల్లల్ని భయపెట్టిన శాసనసభ్యులు!


చట్టాలు రూపొందించే చట్టసభలు ఎలా ఉంటాయో చూడాలని ముచ్చట పడిన స్కూలు విద్యార్థులు షాక్ కు గురైన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లో ఏర్పడిన కొత్త శాసనసభ సభ్యులు దేశంలోని శాసనసభల్లో కొత్త ఒరవడికి నాంది పలకాలని నిర్ణయించుకున్నట్టున్నారు. దీంతో, శాసనసభలో బాహాబాహీకి దిగి, సభా మర్యాదలు మంటగలిపారు. వివరాల్లోకి వెళితే... ప్రత్యక్షంగా శాసనసభా సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు జమ్మూకాశ్మీర్ లోని ఓ పాఠశాల విద్యార్థులు శాసనసభలోని ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. ఇంతలో అసెంబ్లీ మొదలైంది. సభ ప్రారంభమైన కాసేపటికే విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళనకు తెరలేచింది. దీంతో ఆధికార, విపక్ష సభ్యుల మధ్య ప్రారంభమైన వాగ్యుద్ధం ఘర్షణకు దారితీసింది. విపక్ష సభ్యులు వెల్ చుట్టూ చేరి ఆందోళన చేయడంతో, ప్రతిగా ఆందోళనకు అధికారపక్షం తెరతీసింది. రెండు వర్గాలు ఒకే ప్రదేశానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగి, తోపులాటకు దారితీసింది. అంతటితో ఆగని అధికార, విపక్ష సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో బల్లలు తిరగబడిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన మార్షల్స్ కూడా గాయపడ్డారంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాంఘికశాస్త్ర పాఠం నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థుల్లో కొందరు షాక్ కు గురయ్యారు. మరికొందరు జరిగిన సంఘటనను సినిమా చూసినట్టు చూశారు. ఇంకొందరు భయపడిపోయారట. అంతా అయిపోయిన తరువాత పిల్లల ముందు పరువు పోయిందని శాసనసభ్యులు విచారం వ్యక్తం చేశారట.

  • Loading...

More Telugu News