: ఇంతమందికే సాయం చేస్తాం అని ఎలా చెబుతాం? : జయసుధ
మా ఎన్నికల్లో కళాకారులందరికీ లబ్ధి కలిగేలా చూస్తామని సినీ నటి జయసుధ తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, కళాకారుల్లో చిన్న పెద్ద ఉండరని, పని ఉన్న, పని లేని కళాకారులు ఉంటారని అన్నారు. తనను పోటీ చేయమని కోరితేనే మా అధ్యక్షురాలిగా బరిలోకి దిగానని జయసుధ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో మంచి చెడ్డలు తనకు తెలుసని ఆమె చెప్పారు. పేద కళాకారులు తమ పిల్లలకు వివాహం చేయాలని భావిస్తే, వారికి అవసరమైన సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మా సభ్యులందరికీ పెన్షన్లు, హెల్త్ కార్డులు అందజేస్తామని ఆమె వెల్లడించారు. కళాకారులు తిండికి ఉన్నా లేకున్నా పని ఉంటే చాలంటారని, అలాంటి వారికి పనికల్పించేందుకు పాటుపడతామని అవకాశం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అవతలివారు చెప్పిన దానికంటే తాను ఎక్కువ చేస్తాననో లేక తక్కువ చేస్తాననో చెప్పలేనని, చేసి చూపిస్తానని ఆమె తెలిపారు. నిధుల సేకరణ కూడా ప్యానెల్ సభ్యుల నుంచే ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఓ కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరిస్తామని ఆమె అన్నారు. తన వెనుక ఎవరూ ఉండి నడిపించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇంత మందికి సహాయం చేస్తామని చెప్పడమంటే మిగిలిన వారికి సహాయం చేయబోమని చెప్పడమా? అని ఆమె ప్రశ్నించారు.