: ప్రమాదం సమయంలో నేను కారు నడపలేదు, తాగలేదు: సల్మాన్ ఖాన్
2002 హిట్ అండ్ రన్ కేసులో ఈరోజు ముంబయి సెషన్స్ కోర్టుకు హాజరైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనదైన వాదనలు వినిపించాడు. ముంబయిలోని కాలిబాటపై నిద్రిస్తున్న వారిపై వెళ్లిన కారును తాను నడపలేదని, తన డ్రైవర్ అశోక్ సింగ్ కారు నడుపుతున్నాడని తెలిపాడు. అంతేగాక ప్రమాదం సమయంలో తాను మద్యం తీసుకోలేదన్నాడు. అయితే ఈ కేసులో ఉన్న సాక్ష్యాలకు స్పందించమని కోర్టు అడగ్గా, నాడు కారులో ఎడమవైపు ఉన్న డోర్ (డ్రైవర్ సీటులో కాకుండా) స్టక్ అయిందని, దాంతో డోర్ తెరవలేకపోయానని సల్మాన్ వివరించాడు. దానివల్ల డ్రైవర్ సీటువైపు నుంచి బయటికి వెళ్లానని పేర్కొన్నాడు. తనపై తప్పుడు ప్రకటన నమోదైందని సల్మాన్ చెప్పాడు. కారును సల్మాన్ కు అప్పగించానంటూ పార్కింగ్ అటెండెంట్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై సల్మాన్ స్పందిస్తూ, 'నాకు గుర్తులేదు' అని కోర్టుకు సమాధానమిచ్చాడు.