: ఆసీస్ కెప్టెన్ క్లార్క్ ను విచిత్రమైన ప్రశ్న అడిగిన రిపోర్టర్
ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కు మీడియా సమావేశంలో ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. అయితే, ఆ ప్రశ్నను సదరు రిపోర్టర్ పొరబాటున అడగడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. క్లార్క్ కూడా ఆ ప్రశ్నను లైట్ తీసుకున్నాడు. విషయం ఏమిటంటే... టీమిండియాతో సెమీఫైనల్ సమరం ముగిసిన వెంటనే కంగారూ సారథి క్లార్క్, సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ తో కలిసి మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా, ఓ మీడియా ప్రతినిధి, "కెప్టెన్ గా మీ అద్భుతమైన సెక్స్ పై కామెంట్ చేయండి" అని క్లార్క్ ను అడిగాడు. దీంతో, అందరూ అవాక్కయ్యారు. ఇదేంటి ఇలాంటి ప్రశ్న అడిగాడు? అని అక్కడున్నవారు ఆ రిపోర్టర్ వైపు తేరిపార చూశారు. వెంటనే నాలిక్కరుచుకున్న ఆ పాత్రికేయుడు "సారీ, అద్భుతమైన సక్సెస్ పై మీ కామెంట్?" అంటూ పొరబాటు దిద్దుకున్నాడు. అనంతరం క్లార్క్ "అది నా భార్యను అడగాల్సిన ప్రశ్న" అనేసరికి అంతా నవ్వేశారు.