: పెంటగాన్ పై దాడికి పాల్పడిన పైలెట్, జర్మన్ వింగ్స్ ను కూల్చిన పైలెట్ ఒకే చోట శిక్షణ పొందారట!
జర్మన్ వింగ్స్ కు చెందిన 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కో పైలెట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కావాలనే కూల్చేశాడని తేలడంతో అతని నేపథ్యం, విమానం కూల్చివేత వెనుక గల కారణాలపై విచారణకు దిగిన అధికారులకు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. 2001, సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని పెంటగాన్ పై హైజాక్ చేసిన విమానంతో దాడి జరిపిన ఉగ్రవాది శిక్షణ పొందిన ఆరిజోనా సెంటర్లోనే లూబిట్జ్ శిక్షణ పొందాడు. ఇది కాకతాళీయమే అయినప్పటికీ, తన శిక్షణ కాలంలో కొన్ని నెలలపాటు లూబిట్జ్ శిక్షణకు గైర్హాజరయ్యాడన్న విషయం తెలిసింది. వాస్తవానికి శిక్షణలో పైలెట్లకు దీర్ఘకాల సెలవు ఇవ్వరు. అవసరం అయితే సిక్ లీవ్ మాత్రం ఇస్తారు. లూబిట్జ్ ఎందుకు శిక్షణ కాలంలో గైర్హాజరు అయ్యాడన్న విషయం తెలిస్తే, విమానం ప్రమాదం మిస్టరీ వీడిపోవచ్చని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఉన్నతాధికారి కార్ స్టెన్ స్పార్ తెలిపారు. అయితే, ఇప్పటివరకూ లూబిట్జ్ ని అనుమానించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, అయితే, శిక్షణ కాలంలో ఎందుకు అన్ని నెలలు సెలవు పెట్టాడు? ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి వున్నాయని అన్నారు.