: స్పీకర్ పై అవిశ్వాసాన్ని ఉపసంహరించుకుంటున్నాం: అసెంబ్లీలో జగన్ ప్రకటన
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఉపసంహరించుకుంటున్నామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అధికార, విపక్షాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో స్పీకర్ స్థానంపై జగన్ తో పాటు ఆయన పార్టీ సభ్యులు పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారపక్షం వ్యవహరించిన తీరుకు స్పీకర్ మద్దతు పలికారని ఆరోపిస్తూ విపక్షం కోడెలపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్యవర్తిత్వం నేపథ్యంలో కాస్త వెనక్కు తగ్గిన వైసీపీ, తమ అవిశ్వాస తీర్మానం నోటీసును ఉపసంహరించుకుంది. అనంతరం సభనుద్దేశించి మాట్లాడిన స్పీకర్, నోటీసుపై జగన్ ప్రకటన నేపథ్యంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.