: ఆపన్నులకు సాయం మాని ఈ హోమాలేంటీ?: మురళీమోహన్ పై నాగబాబు విమర్శలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన విభేదాలతో తెలుగు చిత్రసీమ రెండు వర్గాలుగా విడిపోయింది. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, మెగా బ్రదర్ నాగేంద్రబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఓ వార్తా ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా మురళీమోహన్ పై నాగబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మురళీమోహన్ నేతృత్వంలో జరిగిన మహా మృత్యుంజయ యాగంపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్రసీమకు చెందిన ప్రముఖుల వరుస మరణాల నేపథ్యంలో హోమం చేయడం మంచిదేనన్న నాగబాబు, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నటులకు బాసటగా నిలవాలన్న విషయం గుర్తురాలేదా? అంటూ ప్రశ్నించారు. హోమాల కంటే ముందు అవసరమైన వ్యక్తులకు సాయం అందించాలని సూచించారు. ‘మా’ దగ్గర నిధుల కొరత ఉంటే, నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కదా? అంటూ 'మా' ప్రస్తుత అధినాయకత్వంపై నాగబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.