: ఢిల్లీ సర్కారుకు కబ్జాకోరుల సవాల్... రూ.5 వేల కోట్ల విలువ చేసే 1,000 ఎకరాలు కబ్జా!
దేశ రాజదాని ఢిల్లీని కూడా కబ్జాకోరులు వదల్లేదు. ఢిల్లీ పరిసరాల్లోని దాదాపు వెయ్యి ఎకరాలను కబ్జా చేసేశారు. వీరి చేతుల్లోని సదరు భూమి విలువ ఎంతలేదన్నా రూ.5,000 కోట్లు ఉంటుందట. ప్రస్తుతం సదరు భూమి రికార్డులతో పాటు భూమి ఎక్కడ ఉందన్న విషయంపై ఢిల్లీ రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విలువైన భూమిని కబ్జా చేసిన భూబకాసురులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మిలాఖత్ అయ్యారట. దీంతో రికార్డులతో పాటు భూమి సరిహద్దులను చెరిపేసి, అధికార యంత్రాంగాన్ని అయోమయంలోకి నెట్టేశారు. ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోని ఛాతర్ పూర్, భట్టి మైన్స్, ఫతేపూర్ బేరీ, మైదాన్ గారి, సాత్ బరి పరిసరాల్లో ఈ భూ దురాక్రమణ చోటుచేసుకుంది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటీషన్ తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.