: మేం రెడీ... మీదే ఆలస్యం!: చంద్రబాబుకు సింగపూర్ సర్కారు లేఖ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమ దేశంలో జరిపే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను సింగపూర్ ప్రభుత్వం ఎప్పుడో ఖరారు చేసింది. అయితే ఉన్నట్టుండి ఆ దేశ ఆధునిక నిర్మాత, ప్రస్తుత ప్రధాని తండ్రి లీకున్ యూ చనిపోయారు. ప్రస్తుతం అక్కడ సంతాప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడికి వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టడమెందుకని ఆలోచిస్తే, మనం పప్పులో కాలేసినట్లే. పర్యటన సమయం దగ్గరపడగానే అక్కడి నుంచి మన పర్యటనకు సంబంధించి గుర్తు చేస్తూ లేఖలు వస్తాయి. ప్రస్తుతం చంద్రబాబు సర్కారుకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఇదివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారమే సింగపూర్ వెళ్లాలని భావించిన చంద్రబాబు, ప్రధాని మోదీ పర్యటనతో వెనక్కు తగ్గక తప్పలేదు. అయితే తమ దేశ నవ నిర్మాత మృతి, సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తూనే తన షెడ్యూల్ ను ఏమాత్రం మార్చుకునేందుకు సింగపూర్ సర్కారు సిద్ధంగా లేదు. ఖరారైన షెడ్యూల్ మేరకే మీరు మా దేశం వస్తున్నారుగా! అంటూ చంద్రబాబుకు ఇటీవలే సింగపూర్ నుంచి లేఖ అందింది. దీంతో కంగుతిన్న చంద్రబాబు సర్కారు, సదరు లేఖకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయింది.