: నేటి మధ్యాహ్నం హస్తినకు చంద్రబాబు... నిధుల సత్వర విడుదలపై కేంద్రంతో చర్చలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి మధ్యాహ్నం ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పలు పద్దుల కింద రాష్ట్రానికి నిధులను కేటాయించింది. అయితే నిధుల విడుదలలో మాత్రం ఆశించినంత వేగం లేదు. మరో నాలుగైదు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈలోగా నిధులు విడుదల కాకపోతే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల విడుదల మరింత జఠిలం కానుంది. ఈ పరిస్థితిపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న చంద్రబాబు తక్షణమే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేటి మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ బయలుదేరనున్న ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై, నిధుల విడుదలపై చర్చిస్తారు.