: పంతం నెగ్గించుకున్న రాహుల్ గాంధీ.. వచ్చే వారంలో ఢిల్లీకి వస్తారట!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. పార్టీలోని అన్ని స్థాయుల్లో సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబడుతున్న ఆయన, అందుకు పార్టీ అధిష్ఠానం ససేమిరా అనడంతోనే సెలవుపై వెళ్లి ఎంతకీ తిరిగిరావట్లేదట. బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ, సెలవు గడవు ముగిసినా ఆయన జాడ లేదు. వచ్చాక మాట్లాడుకుందామన్న అధిష్ఠానం ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తే కాని తిరిగివచ్చేది లేదని రాహుల్ తేల్చిచెప్పారట. దీంతో అధిష్ఠానం దిగొచ్చింది. మే 15 నుంచి సెప్టెంబర్ 30లోగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో శాంతించిన రాహుల్ గాంధీ అజ్ఞాతాన్ని వీడేందుకు సమ్మతించారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీలో వాలిపోతారట. వచ్చీరాగానే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.