: 'ఖబడ్దార్ కేసీఆర్...' బ్యాలెట్ పేపర్లపై రాతలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘అసెంబ్లీ రౌడీ’ సీన్ రిపీట్!
ప్రముఖ నటుడు మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం గుర్తుందిగా. జైల్లోని హీరోను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ తమ సాక్ష్యాన్ని ఓటర్లు తమ ఓటుతో పాటు బ్యాలెట్ బాక్సుల్లో వేస్తారు. ఎన్నికల్లో హీరో గెలవడమే కాక, జైలు నుంచి నిర్దోషిగానూ విడుదల అవుతాడు. నిన్నటి శాసనమండలి ఎన్నికల్లోనూ సేమ్ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ హీరోకు అనుకూలంగా స్లిప్పులు కనిపిస్తే, ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడలపై హెచ్చరికలు కనిపించాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో పాటు తమ వ్యాఖ్యలు రాసిన స్లిప్ లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. కొందరు స్లిప్ లతో పనిలేకుండా, బ్యాలెట్ పత్రం వెనుక భాగంపైనే ఈ వ్యాఖ్యలు రాశారు. ‘‘ఖబడ్దార్ కేసీఆర్. నియంతలా వ్యవహరిస్తున్నావు. తీరు మార్చుకోవాలి. ఇదే పద్ధతి కొనసాగితే, నీ అంతు చూస్తాం’’ అని ఆ స్లిప్పుల్లో రాశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా సదరు స్లిప్ లను చూసిన అధికారులు షాక్ కు గురయ్యారు. సదరు స్లిప్ లను తొలుత టీఆర్ఎస్ నేతలకు చూపించిన అధికారులు, విపక్షాల అభ్యంతరంతో వాటిని చించేసి చెత్తబుట్టలో పడేశారట.