: జర్మన్ వింగ్స్ విమానాన్ని కోపైలెట్ కావాలనే కూల్చేశాడా?
ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమో, ఇంకేదో కాదా? అంటే అవుననే అంటున్నారు, ఈ కేసును వాదిస్తున్న ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్. విమానం నడుపుతున్న కోపైలట్ ఆండ్రియాస్ లబిట్జ్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రమాదం సంభవించడానికి ముందు పైలట్ కాక్ పిట్ బయటకు వెళ్లాడు. అయితే, ఆయన కాక్ పిట్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. కాక్ పిట్ తలుపులు కొట్టినా ఆయన తలుపు తీయలేదు. విమానం కూలిపోయేందుకు కాసేపటి ముందు వరకు కోపైలట్ సాధారణంగా ఊపిరి తీసుకున్నాడని కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో రికార్డయింది. ఊపిరితప్ప ఒక్క మాట కూడా రికార్డు కాలేదట. అంటే కో పైలట్ కావాలనే నిశ్శబ్దంగా ఉన్నాడని ఆయన పేర్కొంటున్నారు. సాధారణంగా ఎయిర్ బస్ ఏ320 వంటి విమానాల కాక్ పిట్ చాలా సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాక్ పిట్ లోపల ఒకరు ఉండి, బయట ఇంకొకరు ఉంటే, దానిని తెరిచేందుకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుందట. లోపల ఉన్నవాళ్లు తలుపు తీసేందుకు నిరాకరించినా, అత్యవసర కోడ్ వినియోగించవచ్చట. అప్పటికీ లోపలి వారు సమాధానం ఇవ్వకుంటే తలుపు ఆటోమేటిగ్గా తెరుచుకుంటుందట. అదే లోపలి వ్యక్తి తలుపు తెరిచేందుకు అనుమతి నిరాకరిస్తే మాత్రం ఐదు నిమిషాల తరువాత తెరచుకుంటుందిట. దీనిని వినియోగించుకున్న కోపైలట్ విమానం కూల్చేశాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.