: ఆంధ్రోళ్లు, రాయలసీమోళ్లు అని ఎంతకాలం అంటారు?...విసిగిపోయా!: అక్బరుద్దీన్ ఒవైసీ
ఆంధ్రా వాళ్లు, రాయలసీమ వాళ్లు అంటూ ఎంతకాలం విమర్శిస్తారు? అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి దానికీ ఆంధ్రావాళ్లు, రాయలసీమవాళ్లు అంటూ విమర్శించడం వినివిని విసిగిపోయామని మండిపడ్డారు. ఇంకా ఎంతకాలం ఆంధ్రా, రాయలసీమ అంటూ పబ్బం గడుపుకుంటారని ఆయన నిలదీశారు. ఆంధ్రా వాడైనా, రాయలసీమ వాడైనా హైదరాబాదులో ఉంటే హైదరాబాదీయే అవుతాడని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదు భారతదేశంలో భాగమని, భారతదేశంలోని ప్రతి పౌరుడికీ ఎక్కడైనా జీవించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మరాఠీ, కన్నడిగుడు, తమిళుడు, బెంగాలీ, బీహారీ, ఆంధ్రా, రాయలసీమ ఇలా ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే వారు హైదరాబాదీయేనని, ప్రాంతాలు, కులాలు, మతాల పేరిట ఇంకా మనుషుల్ని విడదీయవద్దని ఆయన సూచించారు.