: సమాజానికి ఎదురొడ్డి... అన్యాయాన్ని ప్రశ్నించిన యువతి
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లాలో ఓ యువతి సమాజానికి ఎదురొడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన ఘటన సంచలనం రేపింది. యూపీలోని వెనుకబడిన సజోయ్ జిల్లాలోని జాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో యువతిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబం గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలి కుటుంబంతో మాట్లాడి, కీచకుడితోనే వివాహం జరపాలని నిశ్చయించారు. ఇది తెలిసిన ఆమె జాస్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు, కర్తవ్యం నిర్వహించకుండా రాజీ చేశారు. బాధితురాలికి తెలియకుండా ముహూర్తం నిర్ణయించారు. దీంతో నిందితుడు బారాత్ కు సిద్ధమయ్యాడు. విషయం తెలిసి అవాక్కైన యువతి ఆగ్రహం వ్యక్తం చేసి, మరోసారి సర్దిచెప్పాలని ప్రయత్నించిన కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు, పోలీసులకు ఎదురొడ్డి, నిందితుడ్ని అరెస్టు చేసేంతవరకు పట్టువదల్లేదు. దీంతో అత్యాచారానికి పాల్పడిన వాడిపై పోలీసులు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.