: ఒక్కసారి చెబితే అర్థం కాదా?... టీటీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న తెలంగాణ మార్షల్స్
తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గుగైన టీటీడీపీ ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ అవమానాలు ఎదురవుతున్నాయి. సభ నుంచి సస్పెండ్ అయిన మీరు సభా ప్రాంగణంలోకి ఎలా వస్తారంటూ కేసీఆర్ సర్కారు అడుగడుగునా వారిపై ఆంక్షలు విధిస్తోంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ లాబీల్లోకి వెళ్లేందుకు టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నానా పాట్లు పడాల్సి వచ్చింది. నిన్న మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఎర్రబెల్లి బృందం తీవ్రంగా ప్రతిఘటించాల్సి వచ్చింది. తాజాగా నేటి ఉదయం అసెంబ్లీలో తమకు కేటాయించిన టీటీడీఎల్పీ కార్యాలయంలోకి వెళుతున్న వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ అయిన మీరు సభా ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టరాదంటూ మార్షల్స్ వారికి తెగేసి చెప్పారు. దీంతో మార్షల్స్ తో టీటీడీఎల్పీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అయినా అనుమతి లభించకపోవడంతో టీటీడీఎల్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.