: నిప్పులు చెరుగుతున్న టీమిండియా సీమర్లు... ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్, తొలుత బ్యాటింగ్ కు దిగింది. దీంతో ఫీల్డింగ్ కు దిగిన టీమిండియా నాలుగో ఓవర్ లోనే ఆసీస్ వికెట్ ను పడగొట్టింది. తొలి ఓవర్ నుంచే పదునైన బంతులు విసురుతున్న టీమిండియా సీమర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లు ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. తన తొలి ఓవర్ లో ఓ ఫోర్, సిక్స్ సహా 13 పరుగులిచ్చిన ఉమేశ్ యాదవ్ తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ నాలుగో ఓవర్) తొలి బంతికే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(12) ను బోల్తా కొట్టించాడు. ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని అంచనా వేయడంలో వార్నర్ విఫలమయ్యాడు. దీంతో అతడి బ్యాట్ ఎడ్జి తాకి గాల్లోకి లేచిన బంతిని టీమిండియా వైస్ కెప్టెన్ కోహ్లీ ఒడిసి పట్టేశాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.