: కొనసా... గుతున్న ‘వరంగల్’ ఎమ్మెల్సీ కౌంటింగ్... విజయం దిశగా టీఆర్ఎస్ అభ్యర్థి!
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటిలో ఫలితం తేలగా, ఓ స్థానంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ నిన్న ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ స్థానంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. కొద్దిసేపటి క్రితం పదో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. పది రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 7,497 ఓట్ల ఆధిక్యం సాధించారు. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేవీప్రసాద్ అనూహ్యంగా పరాజయం పాలుకాగా, ‘వరంగల్’ స్థానంలోనైనా ఆ పార్టీకి విజయం దక్కుతుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.