: సెమీస్ మ్యాచ్ కోసం రైనా అత్తగారి ఊరికి సెలవు
ప్రపంచకప్ రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా రేపు ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా విజయంపై అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, సురేష్ రైనా అత్తగారి గ్రామంలో సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లోని బముల్ని గ్రామానికి చెందిన ప్రియాంక చౌధురితో రైనాకు ఈ మధ్యనే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తమ గ్రామానికి కాబోయే అల్లుడి కోసం రేపు గ్రామంలో సెలవు ప్రకటిస్తున్నట్టు గ్రామస్థులు తెలిపారు. దుకాణాలు, ఇతర పనులకు విరామం ప్రకటించి, రేపంతా క్రికెట్ చూస్తూ గడిపేస్తామని వారు తెలిపారు. సెమీఫైనల్ సమరం తిలకించేందుకు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో బిగ్ స్క్రీన్లతో ఏర్పాట్లు కూడా చేసినట్టు వారు చెప్పారు. టీమిండియా విజయం సాధించాలని గ్రామంలోని దేవాలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. సెమీ సమరంలో టీమిండియా విజయం సాధిస్తుందని, టైటిల్ కూడా టీమిండియాదేనని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.