: భారత సంతతి అన్నాచెల్లెళ్లకు రూ. 54 కోట్ల పరిహారం... మన్ హటన్ సుప్రీంకోర్టు ఆదేశం
భారత సంతతికి చెందిన అన్నాచెల్లెళ్లు అనుజ్ సాప్రా, ఆర్తీ సాప్రాలకు 'టెన్స్ క్యాబరేట్' సంస్థ 8.64 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 54 కోట్లు) చెల్లించాలని మన్ హటన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2005లో వీరిద్దరూ 'టెన్స్ క్యాబరేట్' నిర్వహిస్తున్న ఒక నైట్ క్లబ్ కు వెళ్ళినప్పుడు ఆసిఫ్, షకూర్ లు అసభ్యకరంగా ప్రవర్తించి, బేస్ బాల్ బ్యాట్లతో దాడి చేశారు. నిందితులు మైనర్లని, వీరికి క్లబ్ నిర్వాహకులు అతిగా మద్యం సరఫరా చేశారని, దాడికి క్లబ్ బాధ్యత వహించాలని బాధితుల తరుపు న్యాయవాది రవి బాత్రా చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. అనుజ్ కు 8 మిలియన్ డాలర్లు, ఆయన సోదరికి 6.4 లక్షల డాలర్లు పరిహారంగా ఇవ్వాలని తీర్పిచ్చింది. కాగా, ఈ కేసులో దాడికి పాల్పడిన ఆసిఫ్ హత్యాయత్నం కేసులో నిందితుడిగా నిరూపణ కాగా, మరో మైనర్ షకూర్ దేశం వీడి పారిపోయినట్టు బాత్రా తెలిపారు.