: మీలా మేము ఆంధ్ర నేతల బూట్లు నాకలేదన్న మంత్రి జగదీష్ రెడ్డి... దద్దరిల్లుతున్న టి.శాసనసభ
తెలంగాణ శాసనసభ దద్దరిల్లుతోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య కొనసాగిన మాటల యుద్ధం సభను అట్టుడికేలా చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, మంత్రి జగదీష్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని... ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నేతల్లా మేము ఆంధ్ర నేతల బూట్లు నాకలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని... వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, పోడియంను చుట్టుముట్టారు. దీనిపై స్పీకర్ మధుసూదనాచారి స్పందిస్తూ, అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. జగదీష్ రెడ్డి కూడా తన వ్యాఖ్యల్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కేసీఆర్ ఆశీస్సులతోనే తాను మంత్రినయ్యానని చెప్పారు.