: ఎమ్మెల్సీ కౌంటింగ్ లో కలకలం... పోలైన ఓట్లు గల్లంతు


తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి తెలంగాణలో కలకలం రేగింది. హైదరాబాదు పరిధిలోని మల్కాజిగిరి, మహబూబ్ నగర్ లో పోలైన ఓట్లలో కొన్ని గల్లంతయ్యాయి. పోలైన ఓట్ల సంఖ్య కంటే బాక్సుల్లో తక్కువ ఓట్లు ఉండటంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న అభ్యర్థులు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు గల్లంతు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి నవీన్ మిట్టల్ వివరణ ఇచ్చారు. ‘‘పోలింగ్ సందర్భంగా చివరి గంటలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతేకాక కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా ఓట్లు తగ్గవచ్చు’’ అని ఆయన చెప్పిన వివరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ జరిగితే, ఓట్ల సంఖ్య ఎలా తగ్గుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఈ విషయంపై పెద్ద ఎత్తున రభస జరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News